Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆ పార్టీ నుంచి చాలా రోజులుగా ఆహ్వానాలు అందుతున్నాయి. తలైవా మనసులో ఏముందో కానీ… బయటకు మాత్రం..బీజేపీ ఆహ్వానాన్ని మన్నించినట్టు కనిపించడం లేదు. అలాగని తిరస్కరించినట్టూ వ్యవహరించడం లేదు. బీజేపీలో చేరికపై రజనీకాంత్ నాన్చుడు ధోరణిలో ఉన్నారు. అసలు రాజకీయాల్లో ప్రవేశంపైనే ఆయన ఎన్నడూ స్పష్టమైన ప్రకటనచేయలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు ఇప్పటివికావు… గత పదిహేనేళ్లుగా దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయినా రజనీ ఎప్పుడూ మనసులో మాట బయటపెట్టలేదు. అయితే జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ శూన్యాన్ని భర్తీచేయడానికి రజనీకాంత్ తప్పకుండా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని బలమైన వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టు బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఈలోగానే.. సినిమాల్లో ఆయన ప్రత్యర్థి, ఒకప్పటి మిత్రుడు అయిన విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి ఇది ఎవరూ ఊహించని పరిణామం.
కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారని ఎవ్వరూ భావించలేదు. ప్రయోగాత్మక సినిమాలతోనే ఆయన జీవితం సాగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా కమల్ తమిళనాడు రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యారు. ట్విట్టర్ వేదికగా సమకాలీన రాజకీయాలపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టి…త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయాల రూపురేఖలు మారుస్తానని ప్రకటించారు. కమల్ చేసిన ఈ ప్రకటన రజనీకి షాక్ లాంటిదే. ఎన్నో ఏళ్లనుంచి తాను ఎటూ తేల్చుకోలేక… సతమతమవుతోంటే కమల్ ఉన్న పళంగా రాజకీయాల్లోకి దూకడం రజనీకి ఆశ్చర్యం కలిగించింది. అందుకే శివాజీ గణేశన్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నప్పుడు కమల్ ను ఉద్దేశించి రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
శివాజీ గణేశన్ రాజకీయ పయనం గురించి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు తమిళ సినిమాల్లో తిరుగులేని స్టార్ గా వెలుగొందిన శివాజీ గణేశన్ రాజకీయాల్లో ప్రవేశించి… పార్టీ పెట్టి… చివరకు సొంతనియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారని చెప్పిన రజనీ..ఆయన రాజకీయ జీవితం ఎందరికో పాఠాలు నేర్పిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపొందాలంటే సినిమాల ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు మాత్రమే చాలవని, దానికి మించిన శక్తి కావాలని, ఆ శక్తి ఏమిటో తనకు తెలియడం లేదని, తన స్నేహితుడు కమల్ హాసన్ కు మాత్రం తెలుసనుకుంటున్నానని అభిప్రాయపడడం ద్వారా రజనీకాంత్ కమల్ హాసన్ రాజకీయప్రవేశంపై తన ఆశ్చర్యాన్ని పరోక్షంగా వ్యక్తంచేశారు. అయితే కమల్ విస్పష్ట ప్రకటన తరువాత కూడా…తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అలాగని కమల్ కు మద్దతూ తెలపలేకపోతున్నారు. మిగతా రాజకీయ సంగతులు పక్కనబెడితే..ఓ విషయంలో మాత్రం రజనీకాంత్… కమల్ హాసన్ బాటలోనే నడిచారు. అదే మెర్సెల్ సినిమా వివాదం.
సినిమాలో విజయ్ క్యారెక్టర్ జీఎస్టీ గురించి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్ ను కమల్ తప్పుబట్టారు. మెర్సెల్ కు సెన్సార్ ఎప్పుడో పూర్తయిందని, మరోసారి సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని కమల్ వ్యాఖ్యానించారు. విమర్శలను ఆపేందుకు ప్రయత్నించకూడదని, వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించాలని పరోక్షంగా బీజేపీకి సూచించారు. తద్వారా తాను కొత్తగా పెట్టబోయే పార్టీ కాషాయదళానికి వ్యతిరేకమే అని స్పష్టంచేశారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా మిత్రునిలానే మెర్సెల్ లోని డైలాగ్ కు మద్దతుపలికారు. ప్రస్తుతం సమాజంలో ముఖ్యమైన అంశాన్నే సినిమాలో ప్రస్తావించారని, మంచి సినిమా తీశారని ట్విట్టర్ లో అభినందించారు. రజనీ చేసిన ఈ ట్వీట్ రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. మెర్సెల్ డైలాగ్ ను సమర్థించడమంటే… బీజేపీని వ్యతిరేకించడమే అని…దీన్ని బట్టి చూస్తే…రజనీకాంత్ కమలం పార్టీలో చేరే అవకాశంలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.