రజనీ ఇంట పెళ్లి బాజాలు…!

Rajinikanth Daughter Soundarya May Marry Vishagan Vanangamudi In February

వ్యాపారవేత్త అశ్విన్‌ ను పెళ్లాడిన రజినీ గారాలపట్టి సౌందర్య తర్వాత ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇద్దరూ 2017లో విడిపోయారు. వీరిద్దరికీ మూడేళ్ల కొడుకు వేద్ క్రిష్ణ ఉన్నాడు. ఇప్పుడు సౌందర్య రజినీకాంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నటుడు, వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లాడనున్నారు. వీరి వివాహం చెన్నైలోని ఎంఆర్‌సీ నగర్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఫిబ్రవరి 11న జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రజినీ ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు సంగీత్, మెహందీ వేడుకలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి వేడుకలు ప్రారంభంకావడానికి ముందు పోయెస్ గార్డెన్‌లోని రజినీకాంత్ ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు.

అలాగే పెళ్లి తరవాత లతా రజినీకాంత్, ఐశ్వర్య ధనుష్ విడివిడి పార్టీలు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. సౌందర్య, విషగన్ నిశ్చితార్థం కిందటేడాది జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. విషగన్ వనంగమూడి ఓ ఫార్మాష్యుటికల్ కంపెనీకి యజమాని. అలాగే నటుడు కూడా. ‘వంజగర్ ఉలగం’ అనే సినిమాలో ఆఖరిగా విషగన్ కనిపించారు. ఈ సినిమా కిందటేడాది విడుదలైంది. సౌందర్య రజినీకాంత్ మాదిరిగానే విషగన్‌ కు కూడా ఇది రెండో పెళ్లి. మ్యాగజైన్ ఎడిటర్ కనిఖ కుమారన్‌ ను మొదట విషగన్ పెళ్లిచేసుకున్నారు. కొన్నికారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు సౌందర్యను ఆయన వివాహమాడనున్నారు.