Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత ఏడాది చివరిరోజు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… అప్పటినుంచి ఇప్పటిదాకా తన పార్టీ గురించి, జెండా, అజెండా గురించి కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. సినిమాలు, హిమాలయాల పర్యటనతో వార్తల్లో నిలిచిన రజనీ… పార్టీ గురించి ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆయన అభిమానులే కాకుండా… యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆయ పార్టీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన దగ్గరనుంచి రజనీ ఖాళీగా కూర్చోలేదు. సినిమాలకే పరిమితమూ కాలేదు. తమిళనాడులో ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో దీర్ఘకాలం పాటు మనగలిగి ప్రజలకు సేవ చేసేలా పార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భావిస్తున్న రజనీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా రజనీ మక్కల్ మండ్రం కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు.
ఈ కార్యవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లా యూనిట్లను ఏర్పాటుచేశారు. వీటికి దశలవారీగా ఏడువేల మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. వారందరికీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందజేసే పనులు కూడా జరుగుతున్నాయి. పార్టీ నిర్మాణం దాదాపు పూర్తయినట్టే. సమయం, సందర్భం, రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు చూసుకుని పార్టీ ప్రకటించనున్నారు. అవినీతిని రూపుమాపి, ఆధ్యాత్మిక రాజకీయాలను ప్రజలకు పరిచయం చేయాలన్నది రజనీకాంత్ లక్ష్యం. తమిళనాడులోని 32 జిల్లాల్లోని 234 నియోజకవర్గాల్లో తాను పెట్టబోయే పార్టీ పోటీచేస్తుందని… రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పిన రోజే ప్రకటించిన రజనీకాంత్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రానికి కార్యవర్గ సభ్యుల నమోదు కార్యక్రమంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా… గెలుపోటములు పట్టించుకోకుండా… ఆద్యాత్మిక, ప్రశాంతత, క్రమశిక్షణతో లక్ష్యం వైపు సాగాలని దశలవారీగా జరిగిన సమావేశాల్లో రజనీ మండ్రం సభ్యులకు సూచించారు.
రాజకీయాలంటే తనకు భయం లేదని, గెలిస్తే విజయం… లేకుండా విరమణ అని… పార్టీ మాత్రం దీర్ఘకాలం మనుగడలో ఉండాలని అభిప్రాయపడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేస్తున్న తలైవా అతి త్వరలోనే పార్టీ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ ప్రారంభానికి ముందే రజనీ ఇంత జాగ్రత్త పడడానికి కారణం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవికి ఎదురయిన అనుభవమే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్ల క్రితం చిరంజీవి ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీనయితే స్థాపించారు కానీ… సంస్థాగత నిర్మాణంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. దీంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ కోలుకోలేకపోయింది. పార్టీ పెట్టి నాలుగేళ్లయినా గడవకముందే… కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా… పార్టీ ఎత్తేయాల్సిరావడం, లేదంటే మరో పార్టీలో విలీనం చేయాల్సి రావడంలాంటి స్థితి తన పార్టీకి రాకుండా… దీర్ఘకాలం సొంతంగా మనగలిగేలా… తలైవా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.