తమిళనాడు వైఖరికి భిన్నంగా ఆధ్యాత్మిక రాజకీయాలు తెస్తానని ప్రకటించిన తలైవా…ద్రవిడ పార్టీ డీఎంకె అధినేత కరుణానిధిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. రజనీ స్వయంగా ప్రకటించినట్టు ఆయనది ఆధ్యాత్యిక పార్టీ అయితే…ద్రవిడ పార్టీలుగా చెలామణీ అవుతున్న డీఎంకె, అన్నాడీఎంకె ఆయనకు ప్రత్యర్థుల కిందే లెక్క. రజనీకాంత్.. రాజకీయ కార్యాచరణ మొత్తం ఆ పార్టీలకు వ్యతిరేకంగానే సాగుతుంది. ఇక భవిష్యత్ తమిళ రాజకీయాలు మొత్తం నాస్తికవాదానికి, ఆధ్మాత్మికతకు మధ్య పోరే అన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో తలైవా వెళ్లి కరుణానిధిని కలవడం చర్చనీయాంశమయింది.
కరుణానిధికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన ఆరోగ్యం గురించి రజనీ వాకబు చేశారు. అనంతరం తన రాజకీయప్రవేశంపై కరుణానిధితో రజనీ చర్చించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, పార్టీ ప్రారంభించే ముందు కేవలం సంప్రదాయ రీతిలో మాత్రమే రజనీ కరుణను కలిశారని, వేరే ఉద్దేశం లేదని స్టాలిన్ అంటున్నారు.ఇంతకుముందు విజయ్ కాంత్ కూడా పార్టీ ప్రారంభించే సమయంలో ఇలానే కరుణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారని స్టాలిన్ తెలిపారు. అదే సమయంలో రజనీకాంత్ రాజకీయ పార్టీ పంథాపైనా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలను కనుమరుగు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.
తమిళ ప్రజల్లో ద్రవిడ సిద్ధాంతం వేళ్లూనుకుపోయిందని, దాన్ని తొలగించే శక్తి భవిష్యత్ తరాలకు కూడా లేదని అన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి నేతలతో ద్రవిడ భూమి తరించిందని, కానీ ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకే రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. ఒకవేళ అదే నిజమైతే రజనీకాంత్ ను అడ్డుకునేందుకు ముందు తామే ఉంటామని హెచ్చరించారు. రజనీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని, గతంలో అలా ప్రయత్నించి విఫలమైన వారు చాలామందే ఉన్నారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి వేయకూడదో తమిళ ప్రజలకు తెలుసన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలు భారత్ ను ఏలుతున్న ఆర్యులకు, తమ ఉనికి కోసం శ్రమిస్తున్న ద్రవిడులకు మధ్య జరిగే పోరాటమని అభివర్ణించారు. కొత్త పార్టీలు పెడుతున్న వారి వెనక బీజేపీహస్తముందని, రాష్ట్రంలో వారి ఆలోచనలు సాగవని త్వరలోనే నిరూపణ అవుతుందన్నారు.