Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాకరాక రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమైన రజని కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వెనకడుగు జస్ట్ పార్టీ ప్రకటనకు సంబంధించి వాయిదా మాత్రమే. ఇంతకుముందు అనుకున్నదాని ప్రకారం జులై లేదా ఆగష్టు 15 రోజు తలైవా భావించారు. కానీ తమిళ రాజకీయాల్లో ఆకస్మిక మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలని రజని భావిస్తున్నారట. అందుకే ప్రస్తుత పరిణామాల్ని గమనించుకునే పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఆ టైం గురించి కూడా ఓ నిర్ణయం జరిగినట్టు రజని సన్నిహితులు ఫీలర్లు వదులుతున్నారు. రజని తన పుట్టిన రోజైన డిసెంబర్ 12 న కొత్త పార్టీ ఏర్పాటుకి సంబంధించి ఓ సభ ఏర్పాటు చేసి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
రాజకీయ పరిణామాలతో పాటు సినిమా వ్యవహారాలు కూడా ఈ ఆలస్యానికి ఇంకో కారణంగా తెలుస్తోంది. రోబో 2.0, కాలా సినిమాల లు కూడా ఈ ఆరు నెలల వ్యవధిలో విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటారు. రోబో 2.0 భారీ సినిమా అయినప్పటికీ అందులో రాజకీయ అంశాల్ని టచ్ చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న కాలా సినిమాలో రాజకీయ ప్రేరేపిత డైలాగ్స్, సన్నివేశాలు వుండబోతున్నాయట. అవి రజని రాజకీయ రంగప్రవేశానికి రూట్ క్లియర్ చేసేలా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై రజని తో పాటు ఆయన అల్లుడు, కాలా నిర్మాత ధనుష్, దర్శకుడు రంజిత్ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఈ నిర్ణయం తీసుకున్నాక రాజకీయ అనుభవం, అభిలాష వున్న చాలా మందితో రజని కాలా షూటింగ్ విరామ సమయాల్లో భేటీ అవుతున్నారు. వీరిలో ఆయనతో పని చేసిన నటీనటులు చాలా మంది వున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చి ఆయనతో రాజకీయంగా నడవాలనుకుంటున్న వాళ్ళు కూడా రాత్రి సమయాల్లో రహస్యంగా వచ్చి రజనికి తమ ఆలోచన గురించి వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వచ్చే నాయకుల్లో ఎక్కువమంది అన్నాడీఎంకే కి చెందిన వాళ్ళే ఉన్నారట.