Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రజని రాజకీయ రంగ ప్రవేశం అయితే నిశ్చయం అయ్యింది కానీ ఇంకా పార్టీ పేరు, ముహూర్తం, సిద్ధాంతం, ప్రచారం లాంటి కీలక విషయాలు తేలలేదు. ఆయన వీటి గురించి ఎప్పుడు మాట్లాడుతారు అనుకునేంతలో కమల్ కొత్త పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన వచ్చింది. ఈ ఇద్దరిలో పొలిటికల్ గా ఎవరు సక్సెస్ అవుతారు అన్న సందేహానికి రిపబ్లిక్ టీవీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్న కోణంలో సర్వే చేసిన రిపబ్లిక్ టీవీ రజనికి తమిళనాట 23 లోక్ సభ స్థానాలు వస్తాయని తేల్చింది. డీఎంకే 14 , అన్నాడీఎంకే రెండు చోట్ల గెలుస్తారని తెలిపింది. మొత్తం ఓట్లలో 33 శాతానికి పైగా రజనికి మద్దతు ఇస్తారని కూడా రిపబ్లిక్ , సి ఓటరు సర్వే లో వెల్లడి అయ్యింది. ఈ ఫలితాలు చూసి రజని పొలిటికల్ గా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే అని ఆయన ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే అదే సమయంలో రజని వెనుక బీజేపీ ఉందన్న విమర్శలకి కూడా బలం చేకూరింది. రజని పార్టీ కూడా అనౌన్స్ చేయకముందే ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే ఆయన పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని చెప్పడాన్ని తమిళ నేతలు ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ టీవీ మీద ఉన్న మోడీ అనుకూల ముద్ర కూడా ఈ సందేహాలకు ప్రధాన కారణం. ఇలాంటి సర్వేలతో రజని ఫాన్స్ కి ఉత్సాహం కలిగినా ఆయన వెనుక బీజేపీ ఉందన్న అనుమానం వస్తే మాత్రం తమిళుల ఆగ్రహం కూడా చవిచూడాల్సి పరిస్థితి తలెత్తుతుంది.