Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నాళ్ళుగానో ఫాన్స్ ని ఊరిస్తూ వస్తున్న తమిళ్ సూపర్ స్టార్ రజని ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఓ వారం రోజులుగా చెన్నై లో ఫాన్స్ తో సమావేశాలు జరుపుతున్న రజని నేడు అధికారికంగా తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం ద్వారా ఏ పార్టీతో పొత్తులు ఉండబోవని రజని తేల్చేశారు. రాజకీయాల్లోకి రావడానికి దారి తీసిన పరిస్థితుల్ని రజని ఫాన్స్ కి వివరించారు. అదేమిటో ఆయన మాటల్లోనే …
“ రాజకీయాల్లోకి వస్తున్నా. డబ్బు కోసమో , పేరు కోసమో రాజకీయ పార్టీ పెట్టడం లేదు. ఇప్పటికే కావాల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు వున్నాయి. నా వైపు నుంచి చూస్తే రాజకీయాల్లోకి రావడం అనవసరమే. కానీ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాలమే ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. తమిళనాట రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. కొన్నాళ్లుగా ఇక్కడి పరిణామాలు చూసి ప్రజలు తీవ్ర ఆవేదనతో వున్నారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడుని చూసి నవ్వుకుంటున్నాయి. ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాడిని అవుతా. అందుకే వస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. మీ అందరి అండ కావాలి. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా. యుద్ధం చేయబోతున్నా. గెలుపు ఓటమి భగవంతుడి చేతుల్లో వుంది.నాకు రాజకీయాలు అంటే భయం లేదు. మీడియా అంటేనే భయం. రాజకీయాల్లో గెలిస్తే విజయం. లేదంటే విరమణ. కాలమే రాజకీయ ఆరంగేట్రాన్ని నిర్ణయించింది. “
ఇలా సాగిన రజని రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన తమిళనాట సంచలనం రేపింది.