మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 21 ఏళ్లకు ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు అవుతున్నప్పుడు అదే వయసుకే చట్టసభ లకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసే విషయాన్ని సోనియాగాంధీతో చర్చిస్తామని తెలిపారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఐటీ ఉద్యోగులను ఎగుమతి చేసే దేశంగా ఎదగడానికి రాజీవ్ గాంధీనే కారణమన్నారు. అనంతరం ప్రకాశం హాల్లో రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేహ దారుఢ్య పోటీలోను, వివిధ విభాగాల్లోను గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అభిజీత్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో రక్తదాన శిబిరం ప్రారంభించారు.