చెల్లెలి మృతితో తీవ్ర విషాదంలో రాజీవ్ కనకాల

చెల్లెలి మృతితో తీవ్ర విషాదంలో రాజీవ్ కనకాల

దివంగత నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమార్తె, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి, నటి శ్రీలక్ష్మి కన్నుమూశారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోన్న శ్రీలక్ష్మి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 40 సంవత్సరాలు. శ్రీలక్ష్మి భర్త పెద్ది రామారావు రచయిత, పాత్రికేయుడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. శ్రీలక్ష్మి పలు టీవీ సీరియల్స్ నటించి పాపులర్ అయ్యారు. కాగా, కనకాల ఫ్యామిలీలో వరుస మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. కిందటేడాది దేవదాస్ కనకాల శ్రీమతి లక్ష్మి, అనంతరం దేవదాస్ కనకాల మృతిచెందారు. ఇప్పుడు శ్రీలక్ష్మి మృతిచెండదం విషాదకరం. చెల్లెలి మృతితో రాజీవ్ కనకాల తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అన్నయ్య రాజీవ్ కనకాలతో శ్రీలక్ష్మికి ఎంతో అనుబంధం ఉంది. తన అన్నయ్యను చిన్నప్పటి నుంచి ఏ రోజూ వదిలిపెట్టి ఉండలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి చెప్పారు. ‘‘అన్నయ్య, నేను విపరీతంగా పోట్లాడుకునేవాళ్లం. నేను ఏదో ఒకటి చేసేదాన్ని.. అది తనకు నచ్చేది కాదు. మీదపడి కొట్టేసేవాడు. నేను తిట్టేసేదాన్ని. తిరిగి కొట్టలేకపోయేదాన్ని. అమ్మ అన్నయ్యకే సపోర్ట్ చేసేది. నాన్న నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. నన్ను కొడితే అన్నయ్యను నాన్న బాగా భయం చెప్పేవారు. ఇలాంటి గొడవులు ఏ తోబుట్టవులకైనా ఉంటాయి. మాకు ఒకరికొకరం ఎంతో ఇష్టం. నాకు పెళ్లయి ఇంట్లో నుంచి బయటికి వెళ్లేంత వరకు ఏ రోజూ అన్నయ్యకు దూరంగా లేను. అమ్మానాన్నకు దూరంగా ఉన్నాను కానీ.. అన్నయ్య, నేను ఒక్కరోజు కూడా దూరంగా లేం’’ అని అన్నయ్య రాజీవ్ కనకాలతో తనకు ఉన్న అనుబంధం గురించి శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు.

సొంత ఇంటిలో అన్నాచెల్లెలు కలిసి ఉండటం సర్వసాధారణమే. అయితే, పెద్దమ్మ వాళ్ల ఇంట్లో కూడా అన్నయ్య తనను వదిలిపెట్టలేదని శ్రీలక్ష్మి వెల్లడించారు. ‘‘అప్పుడు మేం చెన్నైలో ఉండేవాళ్లం. అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే వేసవి సెలవులకు పెద్దమ్మ నన్ను హైదరాబాద్‌లో ఉన్న వాళ్ల ఇంటికి తీసుకొచ్చింది. చెల్లి ఎక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటానని అన్నయ్య కూడా ఇక్కడే ఉండిపోయాడు. అలా మేమిద్దం ఎక్కడున్నా కలిసే ఉన్నాం’’ అని శ్రీలక్ష్మి చెప్పారు. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగినా తామిద్దరి మధ్య అటాచ్‌మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అన్నారు. వదిన సుమ, తనకు సీరియల్స్‌లో పనిచేసేటప్పటి నుంచే పరిచయమని.. అన్నయ్య రాజీవ్‌కు, సుమకు మధ్య తాను మీడియేటర్‌లా పనిచేశానని గుర్తుచేసుకున్నారు.