‘రాజు గారి గది 2’ ప్రివ్యూ…

Raju Gari Gadhi 2 Movie preview

Posted October 12, 2017 at 14:05

నటీనటులు :    నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ 
నిర్మాత :      ప్రసాద్ వి. పొట్లూరి 
దర్శకత్వం :     ఓంకార్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  తమన్ ఎస్.ఎస్ 
 సినిమాటోగ్రఫీ :   దివాకరన్ 

వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున తాజాగా నటించిన చిత్రం ‘రాజు గారి గది 2’. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కి దాదాపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘రాజు గారి గది’ చిత్రం నాగార్జునకు బాగా నచ్చింది. ఇటీవల హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి ప్రాముఖ్యత లభిస్తుంది. ప్రేక్షకులు ఎక్కువగా ఆధరిస్తున్నారు. ఆ కారణంగానే నాగార్జున ఆ జోనర్‌లో కూడా ఒక సినిమా చేయాలని భావించిన చిత్రమే ‘రాజు గారి గది 2’. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మొదటి పార్ట్‌కు ఈ సినిమాకు ఏమాత్రం సంబంధం లేదు. అది హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్‌, ఇది కూడా అదే కాన్సెప్ట్‌. అంతే తప్ప మరేం పోలిక లేదు. టైటిల్‌ బాగుందనే ఉద్దేశ్యంతో దాన్ని కొనసాగించారు. ఈ సినిమాను ఓంకార్‌ చాలా తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరితో కలిసి ఓంకార్‌ నిర్మించాడు. విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఓంకార్‌ ఈ సినిమాను రూపొందించాడని ట్రైలర్‌ మరియు పోస్టర్‌లను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున దెయ్యాలను పట్టే భూత వైధ్యుడిగా నటించాడు, ఆయన కోడలు సమంత దెయ్యం పాత్రలో నటించింది.

సంతోషంగా సాగిపోతున్న అమ్మాయి జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన కారణంగా ఆమె జీవితం అంతం అవుతుంది. పగతో చనిపోయిన ఆమె ఆత్మగా మారుతుంది. ఆ ఆత్మ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంది, ఆ ఆత్మకు నాగార్జున సాయం చేశాడా లేదా ఆ ఆత్మను బంధించాడా అనేది కథ. సమంత ఉన్నది కొద్ది సమయం అయినా కూడా అద్బుతంగా నటించిందని, ఆమె ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం మా అదృష్టం అంటూ దర్శకుడు ఓంకార్‌ చెప్పడంతో ఆమె ఏ స్థాయిలో ఈ చిత్రంలో నటించిందో చెప్పుకోవచ్చు. రేపు విడుదల కాబోతున్న ‘రాజు గారి గది 2’ చిత్రం సక్సెస్‌ గ్యారెంటీ అంటూ సినీ వర్గాల వారు, ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది మరి కొన్ని గంటల్లో చూద్దాం. రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.


SHARE