‘కేజీఎఫ్’ అనే కన్నడ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించినపుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. కన్నడ సినిమాల్ని వేరే భాషల్లో ఎవరు పట్టించుకుంటారు అయినా యశ్ అనే హీరోకు కర్ణాటక అవతల ఏం పేరుంది అంటూ తేలిగ్గా మాట్లాడారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూశాక జనాల అభిప్రాయం కొంచెం మారింది. ‘కేజీఎఫ్’లో ఏదో విశేషం ఉందనే అనిపించింది.
అయినప్పటికీ ఈ సినిమా కర్ణాటక అవతల పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏం జరిగిందో వివిధ భాషల్లో ‘కేజీఎఫ్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో బహు భాషల్లో పెద్ద విజయం సాధించిన సినిమా ‘కేజీఎఫ్’ అంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు కన్నడ నుంచి మరో సినిమా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో నటిస్తున్న హీరో అంత పేరున్నవాడేమీ కాదు. తన పేరు.. రక్షిత్ శెట్టి. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడతను. ఐతే ఈ సినిమాతో కంటే రష్మిక మందన్నా మాజీ లవర్గానే అతడికి ఎక్కువ గుర్తింపు ఉంది.
అతను హీరోగా నటించే సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయడమేంటి దీన్నెవరు పట్టించుకుంటారు అని అంతా అనుకున్నారు. మొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినపుడు పెద్దగా రెస్పాన్స్ లేదు.కానీ నిన్న ఈ సినిమా ట్రైలర్ చూశాక జనాల అభిప్రాయం మారింది. సినిమా విజువల్స్, సెటప్, టేకింగ్ అన్నీ కూడా భలేగా అనిపించాయి.