సమంత హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తోన్న టాక్ షో ‘సామ్ జామ్’. తొలి ఎపిసోడ్లో విజయ్ దేవరకొండను అతిథిగా తీసుకొచ్చారు. తొలి ఎపిసోడ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే, సెకండ్ ఎపిసోడ్లో రానా దగ్గుబాటి పాల్గొనడం.. ఆయన తన జీవితంలో ఎదురైన పాజ్ బటన్ గురించి అంటే అనారోగ్యం గురించి వెల్లడించారు. ఇదే ఆ ఎపిసోడ్‌కు హైలైట్ అయ్యింది. ఇక ఎపిసోడ్ 3లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. ఆ తరవాత ఎపిసోడ్ 4లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు.
అయితే, ఇప్పుడు ఎపిసోడ్ 5 కోసం మరో ఇద్దరు సెలబ్రిటీలను తీసుకొచ్చారు సమంత. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) సామ్ జామ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఈనెల 18 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా ‘ఆహా’ విడుదల చేసింది. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటిలానే బోల్డ్‌గా మాట్లాడేస్తోంది. ఇక క్రిష్ ‘మణికర్ణిక’ వివాదం గురించి స్పందించారు.
రకుల్ ప్రీత్ సింగ్ కాలేజీ రోజుల్లోనే స్కూటీ రైడ్స్‌కి ఛార్జ్ చేసేదని సమంత రివీల్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలీదని.. నీకు ఎలా తెలుసు అంటూ సమంతను అడిగారు రకుల్. సమంత కాస్త బోల్డ్‌గా మాట్లాడుతుంటే.. ‘‘నో రకుల్, ఇది ఫ్యామిలీ షో’’ అంటూ సమంత నవ్వుతూ అన్నారు. దీనికి రకుల్.. ‘‘నాకు తెలుసు. కానీ, నాకు సిగ్గులేదు. నేను ఒక సైకో అని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ చెప్పారు. ఆ తరవాత గత ఎపిసోడ్లలో సెలబ్రిటీలను అడిగినట్టే రకుల్, క్రిష్‌లను కూడా మీడియాలో వచ్చే వివాదాల గురించి అడిగారు. వాటిపై రకుల్, క్రిష్ ఇద్దరూ మాట్లాడారు. వీటి గురించి పూర్తిగా తెలియాలంటే డిసెంబర్ 18న ప్రసారమయ్యే ఎపిసోడ్లో చూడాలి.