‘‘నేను తీసుకున్న నిర్ణయాల్లో వీగన్ (కేవలం చెట్లనుంచి వచ్చే ఆహారాన్ని తీసుకోవడం, మాంసాహారం మాత్రమే కాదు జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, పెరుగు వంటివి తీసుకోకపోవడం) అవడం ఓ మంచి నిర్ణయం’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. నవంబర్ 1 ప్రపంచ వీగన్ దినోత్సవం. రకుల్ వీగన్‌గా మారి దాదాపు ఏడాది కావొస్తోంది.
ఈ సందర్భంగా ఈ ప్రయాణం గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘వీగన్‌గా మారాలని ప్రత్యేకంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకో కొన్ని రోజులు మాంసాహారం తినబుద్ధికాలేదు. మాంసాహారం తీసుకోకపోవడం వల్ల ధ్యానం చేస్తున్నప్పుడు చాలా మార్పు కనిపించింది. ఇలా ఒక నెల రోజులు కొనసాగిన తర్వాత నా శరీరంలో మంచి మార్పు వచ్చింది. శరీరమంతా చాలా తేలికగా ఉండటం, నిగారింపు పెరగడం గమనించాను. మంచిని ఎప్పుడూ కొనసాగించాలి కాబట్టి పూర్తిగా వీగన్‌గా మారిపోయాను’’ అన్నారు.