టాలీవుడ్ మీద ఫోకస్ తగ్గించి బాలీవుడ్‌లో బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హీరో జాన్ అబ్రహాంతో కలిసి ‘అటాక్’ సినిమా చేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్ బ్లాస్టింగ్ జరిపారు. దీనికి తగు ముందు జాగ్రత్తలు సైతం పాటించారు. అయితే షూటింగ్ గురించి తెలుసుకున్న గ్రామస్తులు సెట్స్ వద్దకు చేరుకుని నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు.
దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు దాడికి దిగారు. సెట్స్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయాలపాలయ్యారు. హీరోహీరోయిన్లకు ఎటువంటి గాయాలు కాలేదు.
కాగా అటాక్ సినిమా విషయానికి వస్తే…లక్ష్యరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆగస్టు 13న విడుదల కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ కనిపించనుంది. కామెడీ డ్రామా డాక్టర్ జీలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది.