టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైంది. ఈడీ అధికారుల కంటే ముందే రకుల్ అక్కడికి చేరుకుంది. ఉదయం 10:30 కి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా..9:10కే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది.
చేతిలో ఓ ఫైల్ పట్టుకొని చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్‌తో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు వచ్చింది.డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ని ప్రశ్నించనున్న ఈడీ.. ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లతో పాటు ఇతర వివరాలను తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది.
నిజానికి సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరవుతానని రకుల్.. ఈడీకి మెయిల్ ద్వారా తెలిపింది. దీంతో డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులో పేర్కొంది.
2017లో జరిపిన ఎక్సైజ్ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్‌కు డ్రగ్స్ కేసుతో పలు లింకులున్నట్లు ఈడీ విచారణలో గుర్తించింది. అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రకుల్‌ను విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌ను 10 గంటలు, చార్మిని ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ రకుల్‌ను ఎన్ని గంటలు విచారిస్తుందో చూడాల్సి ఉంది.