‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. హిందీ సహా ఇతర భాషల్లోనూ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా హిందీలో నటిస్తోన్న చిత్రం ఛత్రివాలి. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్‌గా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రకుల్.. చత్రీవాలిలో తన పాత్ర గురించి వివరించింది.అలాగే ఈ పాత్రపై తన తల్లిదండ్రు ఎలా స్పందించారో ఈ సందర్భంగా ఆమె తెలిపింది.
ఈ మేరకు రకుల్ మాట్లాడుతూ.. ‘ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటి నుంచో మన సమాజంలో ఉన్నదే. దీనినే మేము సరికొత్త ప్రయత్నంలో ప్రేక్షకులకు చూపెట్టబోతున్నాం. అందరూ మెచ్చేలా ఓ కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కించాం. ఇది ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి.. కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా మారిన ఓ అమ్మాయి కథ. మొదట జీతం కోసమే జాబ్‌లో చేరిన ఆ యువతి అనంతరం దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది. అలాగే ‘మనం ఎలా పుడతామో అందరికీ తెలుసు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం.యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. వారికి ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలియాలి.
అలా అనీ ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలేవి ఉండవు. వాస్తవానికి ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్ని చేయాలని నిర్ణయించుకున్న. ఇక ఈ సినిమాలో నా పాత్ర గురించి నా తల్లిదండ్రులకు వివరించాను. వాళ్లు మరో ఆలోచన లేకుండా నన్ను చేయమని ప్రోత్సాహించారు. ఇది మాత్రమే కాదు నేను చేసే ప్రతి సినిమా కథ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఓకే చెబుతాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ప్రేక్షకులే’ అని రకుల్ చెప్పుకొచ్చింది. కాగా ఛత్రీవాలి సినిమాతో పాటు హిందీలో అటాక్, రన్‌వే 34, డాక్టర్ జి, అయలాన్, మిషన్ సిండ్రెల్లా అనే చిత్రాల్లో నటిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ.