యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ బోయపాటి శ్రీను అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలను చూస్తే ప్రతి సినిమాలో కూడా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలయ్యతో తెరకెక్కించిన ‘సింహా’ మరియు ‘లెంజెండ్’ చిత్రాలను చూస్తే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం అవుతాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు బోయపాటి యాక్షన్ సీన్స్ జోరు కనిపించడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు అంటున్నారు.
రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంలో తన గత చిత్రాల్లో ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ ఉండవని చెప్పకనే చెబుతున్నాడు. కారణం సినిమా ప్రారంభంకు ముందే దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిరంజీవి క్లారిటీ చెప్పాడట. కథ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోను. కాని యాక్షన్ సీన్స్ విషయంలో మాత్రం కాస్త తగ్గాల్సిందే అన్నాడట. యాక్షన్ అతిగా లేకుంటేనే చరణ్ మూవీ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడట. దాంతో చరణ్ మూవీ కోసం తన పంథాను పక్కకు పెట్టి సాదారణ యాక్షన్ సీన్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట. బోయపాటి అంటేనే యాక్షన్ సీన్స్, మరి చరణ్ మూవీలో యాక్షన్ సీన్స్ తగ్గితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.