ఇటీవల గుండెపోటుతో కర్ణాటక అగ్ర కథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీనే కాదు.. యావత్ సినీ పరిశ్రమ, ప్రధాని మోడితో పాటు పలువురు రాజకీయ నాయకులు పునీత్ మరణంపై సానుభూతిని వ్యక్తం చేశారు. బుధవారం రోజున హీరో రామ్‌చరణ్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఆయన ఈ సందర్భంగా అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ‘‘పునీత్‌గారు చనిపోవడం మా కుటుంబంలో వ్యక్తిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది. ఆయనకు అలా జరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. మాటలు కూడా రావడం లేదు. అసలు జరిగిందా? అనే షాక్‌లో ఉన్నాం. మా మర్యాదపూర్వకంగా, ప్రేమతో ఉండే వ్యక్తి పునీత్. ఆయనలాంటి వ్యక్తికి ఇలా జరగడం ఎంతో బాధాకరంగా ఉంది. మా ఇంటికొస్తే ఆయన ముందు మేమే గెస్ట్‌లాగా ఫీలయ్యేలా చేస్తారు. వ్యక్తులను సొంతవాళ్లలా చూసుకుంటారు. సాధారణ వ్యక్తిలా ఎలా ఉండాలని ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన ఇండస్ట్రీకి, సోసైటీకి ఎంతో చేశారు. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నాం’’ అన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెదిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు హీరోలతో, తమిళ హీరోలతో ఎంతో స్నేహంగా ఉండేవారు. హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చిన ఇక్కడి హీరోలను ప్రత్యేకంగా కలుసుకుని మాట్లాడేవారు. అలాగే మన హీరోలు ఎవరైనా అక్కడకు వెళితే, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఆతిథ్యాన్ని అందించేవారు. సినిమాల్లో హీరోగానే కాదు, రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిరూపించుకున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పిల్లలకు చదువులు చెప్పించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. చివరకు చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేసి నలుగురికి కంటి చూపును అందించారు.
కన్నడలో పవర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆయన చాలా ఫిట్‌గా ఉండేవారు. జిమ్ చేస్తూ శరీరాన్ని చక్కగా ఉంచుకునేవారు. ఆయన రీసెంట్‌గా జిమ్ చేస్తున్న సమయంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి విక్రమ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడకెళ్లిన ఐదు నిమిషాలకు ఆయన కన్నుమూశారని డాక్టర్లు ధృవీకరించారు. ఆరోగ్య విషయంలో ఎందరితో స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చిన ఆయనకు ఇలా జరగడం అందరికీ షాకింగ్ న్యూస్‌గా మారింది.