Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని తెరకెక్కించడానికి తెలుగు చిత్రసీమలో ఒక్కసారిగా ప్రయత్నాలు ఊపందుకుంన్నాయి. ఎప్పుడైతే ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరకెక్కిస్తానని బాలయ్య ప్రకటన చేశారో అప్పటి నుంచి ఎన్నో సంచలనాలు. ఎన్టీఆర్ సినిమాకి తానే దర్శకుడు అని రామ్ గోపాల్ వర్మ ప్రకటించుకున్నారు. అందుకు వున్న అర్హతలు ఏమిటో కూడా చెప్పేసుకున్నారు. వర్మ డైరెక్ట్ చేయబోయే ఎన్టీఆర్ జీవిత చరిత్ర లో బాలయ్య హీరో అని అంతా అనుకున్నారు. అయితే వర్మ ప్రకటన తర్వాత బాలయ్య ఆ విషయం ప్రస్తావించకపోవడంతో అసలు ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద ఎన్ని సినిమాలు వస్తున్నాయి? దీనికి ఎవరు దర్శకుడు ? దేనికి ఎవరు హీరో అన్న దానిపై ఓ స్పష్టత లేకుండా పోయింది. పైగా వర్మ, బాలయ్య లకి ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీసే సత్తా లేదంటూ లక్ష్మీపార్వతి అప్పట్లో మీడియాకి కూడా ఎక్కారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఓ ఘటన జరిగింది.
లక్ష్మీపార్వతి విమర్శలకి గురి అయిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి చేసిన ప్రకటనలో ఆయన వెన్నుపోటు, నేకేడ్ ట్రూత్ వంటి మాటలు వాడారు. అంటే ఈ సినిమా టైటిల్ ఆయన వాడిన మాటలు చూస్తుంటే లక్ష్మీపార్వతి కి అనుకూలంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా వర్మ సినిమా తీయబోతున్నట్టు అనిపిస్తోంది. మొన్నటిదాకా మెగా క్యాంపు ని ఆడిపోసుకుని బాలయ్య ని పొగడ్తలతో ముంచెత్తిన వర్మ ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక బాలయ్య మీద అలకే కారణం అని తెలుస్తోంది.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి ఇంతకుముందు వర్మతో బాలయ్య ఒకటిరెండు సార్లు మాట్లాడాడంట. అయితే తనకు చెప్పకుండానే సినిమా మీద వర్మ పబ్లిక్ గా ప్రకటన చేసాక బాలయ్య వర్మతో ఆ టాపిక్ చర్చించలేదట. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ మీద బాలయ్య దర్శకుడు తేజతో సంప్రదింపులు జరిపిన విషయం బయటికి వచ్చిందట. దీంతో హర్ట్ అయిన వర్మ ఇలా లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంకేతాలు ఇచ్చారట. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటున్న వర్మని ఏకేసిన లక్ష్మీపార్వతి ఇప్పుడు తనకు అనుకూలంగా సినిమా చేయబోతున్న ఆయన గురించి ఏమి అంటారో చూడాలి. ఈ వ్యవహారం మీద బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది అంతకు మించి ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆయన సినిమా కూడా సంచలనమే.