Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గతంలో ఎన్నో సినిమాలు రూపొందించారు . అయితే ఆ సినిమాల సమయంలో ఆయా ఘటనలకు సంబంధించిన వివాదస్పద అంశాలు ప్రస్తావించి సినిమాకు పబ్లసిటీ తెచ్చుకునేవారు తప్ప… కథకు సంబంధించిన వ్యక్తులను ప్రశంసించిన సందర్బాలు అంతగా లేవు. కానీ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రకటించిన వర్మ… ఈ సినిమా విషయంలో తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారని చెప్పి వివాదానికి తెరలేపి… టీడీపీ నేతలతో సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం సాగించి… ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్నప్పటికీ… ఓ విషయంలో మాత్రం గతానికి భిన్నంగా వ్యాఖ్యలుచేస్తున్నారు.
దాదాపు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న వర్మకు ఎన్టీఆర్ కుటుంబంతో అంత సన్నిహిత సంబంధాలున్నట్టు కనిపించదు. తెలుగులో సంచలనదర్శకుడిగా హవా సాగిస్తున్న కాలంలో నాగార్జున, వెంకటేశ్ , జగపతిబాబు, జేడీ చక్రవర్తి వంటి హీరోలతో మార్చి మార్చి సినిమాలు తీసిన వర్మ… అగ్రహీరోగా ఉన్న బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగే ఏ ఇంటర్వ్యూ లోనూ వర్మ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన సందర్భమూ లేదని చెప్పొచ్చు. అందుకే ఎన్టీఆర్ పై సినిమా తీస్తున్నానని వర్మ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక టైటిల్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ గా ప్రకటించగానే… వివాదమూ చెలరేగింది. అందుకు తగ్గట్టుగా… కొన్నిరోజుల పాటు వివాదాన్ని నడిపించిన వర్మ… ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఎన్టీఆర్ ను అదేపనిగా పొగడడం మొదలుపెట్టారు. ఆయన మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, ఆయన గురించి తెలుసుకుంటోంటే ఆశ్చర్యం వేస్తోందని వర్మ ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా మరో అడుగు ముందుకువేసి ఎన్టీఆర్ ఆత్మ తనకు రోజూ కలలోకి వస్తోందంటూ హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు… లక్ష్మీస్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ రాయడానికి ఎన్టీఆర్ ఆత్మ సహకరిస్తోందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమైన బలాన్నిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది అని వర్మ ట్వీట్ చేశారు. నిజానికి వర్మది దేవుళ్లను, ఆత్మలను నమ్మే మెంటాలిటీకాదు. అలాగే ఓ వ్యక్తిని అదే పనిగా పొగడడానికీ వర్మ వ్యతిరేకం. అలాంటి వర్మ ఇలా ఎన్టీఆర్ ను దైవాంశసంభూతడంటూ… తనకు పొసగని పదజాలంతో పొగడడం, ఆత్మ, శక్తి అంటూ మాట్లాడటానికి గల కారణం… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమానే. వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది సినిమా పబ్లిసిటీ కోసమే కాదు… ఈ సినిమా చంద్రబాబుకు, టీడీపికి వ్యతిరేకంగా తెరకెక్కుతోందన్న వార్తల నేపథ్యంలో వర్మ ఒకరకమైన డిఫెన్స్ లో పడిపోయారు. నిర్మాతల అభిరుచికి తగ్గట్టుగా సినిమా తీస్తూ… తాను కొన్ని వర్గాలకు వ్యతిరేకం కావడం ఎందుకున్నది వర్మ ఆలోచన. సినిమాను వైసీపీ నేత నిర్మిస్తుండడంతో… ఎన్టీఆర్ అభిమానులకు సైతం లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సందేహాలున్నాయి. అందుకే వారిలో నమ్మకం పెంచేందుకే వర్మ ఈ ట్రిక్ ప్రయోగిస్తున్నారు. ఎన్టీఆర్ ను పొగిడితే ఆయన అభిమానులతో పాటు… టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు రావన్నది వర్మ ప్లాన్.