Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దెయ్యం, భూత్, రాత్రి లాంటి సినిమాలకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆ బ్రాండ్ నుంచి బయటపడడానికి వర్మ మాఫియా, జీవిత చరిత్రలు మీద పడ్డాడు. ఆ కోవలోనే ఇప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” అనౌన్స్ చేసాడు. వంగవీటి అట్టర్ ప్లాప్ తర్వాత వర్మ పబ్లిసిటీ స్టెంట్స్ చూసి వైసీపీ నేత రూపంలో ఓ నిర్మాత అయితే దొరికాడు. నిర్మాత దొరికినా వర్మ పబ్లిసిటీ స్టెంట్స్ చూసి ఒక్క ప్రముఖ నటుడు కూడా బుట్టలో పడడం లేదు. దీంతో ఈ సినిమాకి ఆయువుపట్టు లాంటి ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి పాత్రలకి కొత్త వాళ్లనే ఓకే చేసాడు వర్మ. దీంతో సినిమాకి ఎక్కడ క్రేజ్ తగ్గిపోతుందో అన్న భయం వర్మకి పట్టుకుంది. అటు బాలయ్య, తేజ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో పెద్ద పెద్ద నటులు కీలక పాత్రలకి ఓకే చేశారు. ఈ పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ పెంచడానికి వర్మ టీడీపీ నేతల్ని రెచ్చగొట్టాడు. అది కూడా ఎక్కువ కాలం సాగదని అర్ధం అయ్యాక పాత ఐడియాని కొత్తగా ముందుకు తెచ్చాడు వర్మ.
ఒకప్పుడు దెయ్యాలు, భూతాల సినిమాలు తీసిన అనుభవంతో ఇప్పుడు ఆత్మ ని అది కూడా ఎన్టీఆర్ ఆత్మని అస్త్రంగా మలుచుకున్నాడు. ఎన్టీఆర్ ఆత్మ స్వయంగా తనతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” స్క్రిప్ట్ రాయిస్తోందని వర్మ తాజాగా చెప్పుకున్నాడు. ఒకప్పుడు వర్మ ఇలాంటి మాటలు చెబితే ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటివి చెప్పకపోతే ఆశ్చర్యంగా చూసే పరిస్థితి ఎదురవుతోంది. అయినా వర్మ ఏమి చెప్పినా జనానికి నాన్నా పులి కథ గుర్తుకు రావడం తప్ప ప్రయోజనం లేదు.