Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా కథ గురించి పది సెకన్లు కూడా ఆలోచించని వారే లక్ష్మీస్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలియని విషయాలను చెప్పాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ సినిమాల్లో రాణించి, రాజకీయాల్లో సక్సెస్ అయినప్పటి పరిస్థితులు, చివరి రోజుల్లో ఆయన అనుభవించిన జీవితంవేరని వర్మ చెప్పారు. అగ్రహీరో కావడం, రాజకీయాల్లో తిరుగులేని విజయాన్ని అందుకోవడం ద్వారా దైవాంశ సంభూతుడుగా అందరూ భావిస్తున్న ఓ వ్యక్తి ఒక సాధారణ మహిళను తన జీవితంలోకి ఆహ్వానించిన తీరు కొత్త కోణంలో ఉందని వర్మ అభిప్రాయపడ్డారు.
లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత ఎన్టీఆర్ జీవితానికి, ముందు జీవితానికి చాలా తేడా ఉందని వర్మ విశ్లేషించారు. తన సినిమాలో ఎన్టీఆర్ చివరి రోజుల్లో బాధాకర మానసిక పరిస్థితికి వచ్చిన తీరును చెబుతానని వర్మ తెలిపారు. సినిమాల్లో ఏ యే పాత్రలు ఉంటాయో తానిప్పుడు చెప్పనన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో తాను మాట్లాడలేదని, వారు చెప్పాల్సిందింతా ఇప్పటికే మీడియా ముందు చెప్పారని, తాను వారు చెప్పింది కాకుండా ఎవ్వరికీ తెలియనది చూపాలనుకుంటున్నాను అని ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తున్నప్పటికీ లక్ష్మీ పార్వతి చెప్పింది తాను తీయడం లేదని… అలా తీస్తే అందరికీ తెలిసిందే… చెప్పడమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన సినిమాలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత తెర వెనక ఏం జరిగిందో తీస్తానని వర్మ వివరించారు.