మళ్లీ విధుల్లోకి రమణదీక్షితులు !

Ramanadhikshithulu Wrote Latter To Eo singhal

రమణ దీక్షితుల వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదని వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను తమకూ వర్తింప చేయాలంటూ రమణదీక్షితులు టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఈ ఏడాది మేలో అర్చకులకు 65 సంవత్సరాల నిబంధనల పెట్టింది టీటీడీ. అయితే కొత్తగా తీసుకునే అర్చకులు కూడా రిటైరయ్యే వారి కుటుంబసభ్యులే ఉంటారు. ఆ నిర్ణయం ప్రకారం శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చక హోదాలో వున్న నలుగురు మిరాశీ అర్చకులతో సహా తిరుచానురు ఆలయంలోని అర్చకులతో పాటు దాదాపు 20 మంది అర్చకులకు ఉద్వాసన పలికారు. వీరిలో అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయిన రమణదీక్షితులు కూడా ఉన్నారు.

టీటీడీ రిటైర్మెంట్ ఇచ్చేసిన విషయంపై తిరుచానురు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించగా శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో వుంది. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్ అనేదే లేదని పనిచేసే శక్తి వున్నన్నాళ్లు వారిని అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇదే తీర్పును తమకు అమలు చేయాలని తమని విధుల్లో చేర్చుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు టీటీడీ ఈఓ సింఘాల్ కు లేఖ రాశారు. ఇప్పటికే టీటీడి పై పలు కేసులు వేసిన రమణ దీక్షితులు ఇవన్నీ కోర్టు పరిధిలో పెండింగ్ లో వుండగానే తిరిగి తనను విధుల్లోకి తీసుకోవాలంటూ టీటీడీ ఈవో సింఘూల్ లేఖ పంపడం సంచలనంగా మారింది. టీటీడీ ఆ లేఖను న్యాయశాఖకు పంపించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అప్పిలుకు వెళ్ళే ఆలోచనలో వున్న టీటీడీ రమణ దీక్షితులు వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. సుప్రింకోర్టులో కేసు తేలే వరకు రమణ దీక్షితులను మాత్రం విధుల్లోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.