రణ్‌బీర్ కపూర్ వెబ్ ఎంట్రీకి రెడీ అయ్యారనే వార్తలు బాలీవుడ్లో షికారు చేస్తున్నాయి. హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్స్టన్ నటించిన టీవీ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ వెర్షన్లో నటించనున్నారట రణ్‌బీర్. ఇంగ్లిష్‌లో విజయం సాధించిన ఈ కథ ఆధారంగా హిందీలో 10 ఎపిసోడ్స్ నిర్మించనున్నారని సమాచారం. కొన్ని వారాల క్రితమే ఈ సిరీస్‌లో నటించడానికి రణ్‌బీర్ అధికారికంగా సైన్ చేశారని టాక్.
అయితే దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? అనే ఆలోచనలో ఉందట ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించనున్న డిస్నీ హాట్‌స్టార్ సంస్థ. భారీబడ్జెట్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ కథను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం రణ్‌బీర్ మల్టీస్టారర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’లతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌కు డేట్లను సర్దుబాటు చేసే పనిలో పడ్డారట రణ్‌బీర్ కపూర్.