గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా క్రమంగా తగ్గుతుందనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. ఇటీవలి పరిమాణాలు చూస్తుంటే తిరిగి కరోనా కోరలు చాస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకానొక దశలో భారీగా తగ్గిన కరోనా కేసులు రీసెంట్గా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండటం చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తెలుపుతూ ఆయన తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
”మంగళవారం జరిపిన పరీక్షల్లో రణ్‌బీర్ కపూర్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో రణబీర్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు” అని పేర్కొంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రణ్‌బీర్ తల్లి నీతూ. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రణ్‌బీర్ కపూర్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్గా నటిస్తుండగా.. నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా రణ్‌బీర్, అలియాలతో కలిసి తెగ సందడి చేశారు నాగ్. రీసెంట్గా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, ఇదో అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు.