బిహార్‌ ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై రేప్‌ కేసు

బిహార్‌ ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై రేప్‌ కేసు

లోక్‌ జన్‌శక్తి పార్టీ నేత, బిహార్‌లోని సమస్తీపూర్‌ ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై రేప్‌ కేసు నమోదైంది. ఎల్‌జేపీ ముఖ్యనేత చిరాగ్‌ పాశ్వాన్‌కు ప్రిన్స్‌ రాజ్‌ దగ్గరి బంధువు. ఎల్‌జేపీ మహిళా కార్యకర్త గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రిన్స్‌రాజ్‌పై ఫిర్యాదు చేయొద్దంటూ తనపై చిరాగ్‌ ఒత్తిడిచేశారంటూ బాధితురాలు పేర్కొనడంతో చిరాగ్‌ పేరునూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన పేరును చేర్చడంపై చిరాగ్‌ పాశ్వాన్‌ గతంలో∙స్పందించారు. ‘వివాదాన్ని పరిష్కరించాలని ఇద్దరూ నా వద్దకు వచ్చారు. పోలీసుల వద్ద తేల్చుకోండని సూచించాను.

కేసు వద్దని సదరు మహిళపై నేనేమీ ఒత్తిడి చేయలేదు’ అని అన్నారు. కేసు నమోదు నేపథ్యంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రిన్స్‌రాజ్‌ మంగళవారం ఢిల్లీ కోర్టు మెట్లెక్కారు. ముందస్తు బెయిల్‌ దరఖాస్తును స్పెషల్‌ జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ గురువారం పరిశీలించనున్నారు. ‘ సదరు మహిళ సమ్మతితోనే సంబంధాన్ని కొనసాగించాను. ఆమెకు వేరే వ్యక్తితో అంతకుముందే సంబంధముంది. మేం సన్నిహితంగా ఉన్నపుడు ఆ వ్యక్తి వీడియోలు తీశాడు. కొన్నాళ్ల తర్వాత రూ.1 కోటి ఇవ్వాలని వారిద్దరి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. రూ.2 లక్షలు ముట్టజెప్పాను. తర్వాత చట్టప్రకారం సమస్య పరిష్కారం కోసం పోలీసులకు ఫిర్యాదుచేశాను’ అని ఫిబ్రవరిలో ఇచ్చిన పోలీసు ఫిర్యాదులో ప్రిన్స్‌రాజ్‌ పేర్కొన్నారు.