కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని చెరబట్టాడు. వావివరుసల విచక్షణ మరిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లి విషయం బయటకు రాకుండా అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించింది.
డాక్టర్ల ఫిర్యాదుతో పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మే, జూన్ నెలలో భార్య ఇంట్లో లేని సమయంలో కుమార్తెను బెదిరించి తన పశువాంఛ తీర్చుకున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గ్రహించిన ఆమె తల్లి డాక్టర్లకు చూపించగా గర్భవతి అని తేల్చారు. దీంతో ఏం జరిగిందని తల్లి నిలదీయగా బాలిక అసలు విషయం చెప్పింది.
అయితే ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోవడంతో పాటు భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించిన ఆమె కూతురికి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించేందుకు కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టర్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు చెన్నై పారిపోయేందుకు ప్రయత్నించగా ముసునూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు