ప్రస్తుతం రాశీ ఖన్నా దక్షిణాది ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీనికి కారణంగా ఇటీవల సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే. సౌత్ సినిమాలు రొటిన్‌గా ఉంటాయని, అక్కడ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాశీ ఖన్నాపై దక్షిణాది ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, స్టార్‌డమ్ ఇచ్చిన దక్షిణాది పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు ఆమెకు క్లాస్ పీకుతున్నారు.
ఇక తనపై వస్తున్న వ్యతిరేకతను చూసి రశీ దిగొచ్చింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. దక్షిణాది పరిశ్రమపై తాను విమర్శ వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘నేను సౌత్ ఇండస్ట్రీని దూషించలేదు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు సమానమే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేనంటే గిట్టని వాళ్లు ఎవరో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఇది ఆపండి. దయ చేసి నాపై వస్తున్న ఈ వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నా’ అంటూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
కాగా ఇటీవల హిందీలో ఆమె నటించిన రుద్ర వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా రాశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ‘దక్షిణాది సినిమాలు రొటిన్‌గా ఉంటాయి. అది నాకు నచ్చకపోయిన చెయాల్సి వచ్చింది. అలా రొటిన్‌కు అలవాటు పడిపోయాను. అక్కడ హీరోయిన్‌కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలా కనిపించి ఇలా కనుమరుగైపోతుంది. అంతేకాదు అక్కడ హీరోయిన్లకు మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్‌లు కూడా ఇస్తారు. ఇది నాకు అసలు నచ్చని విషయం. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఇకపై మీరు ఓ కొత్త రాశీని చూస్తారు’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి.