కాబూల్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్గనిస్థాన్ జట్టు ఘోర పరాజయాలు ఎదుర్కొంది. కొద్దిరోజులుగా సంచలన ప్రదర్శన చేస్తున్న అఫ్గాన్ మెగా టోర్నీలో కనీసం ఒకటి రెండు విజయాలు సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఆ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు కెప్టెన్‌ను మార్చడం.. ఆదేశ క్రికెట్ బోర్డు, కోచింగ్ సిబ్బంది మధ్య గొడవలు ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించాయి.
విశ్వసమరంలో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన జట్టులో సమూల మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా పలు టీ20 టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ తక్కువ కాలంలో బెస్ట్ బౌలర్‌గా పేరొందిన 20ఏండ్ల రషీద్ ఖాన్‌కే జట్టు పగ్గాలు అప్పగించారు. కీలక సమయాల్లో బంతితో పాటు బ్యాట్‌తో రాణించే సత్తా ఈ యువ ఆల్‌రౌండర్ సొంతం. ప్రస్తుత సారథి అస్గర్ అఫ్గన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మూడు ఫార్మాట్లకు రషీద్ ఖానే సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లో రషీద్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.