టాటా గ్రూప్ కొత్త చైర్మన్ ఎంపిక విషయంలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం చైర్మన్ పదవిలో ఉన్న చంద్రశేఖరన్‌నే.. రెండోసారి కొనసాగించాలనే సంప్రదింపులు నడుస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా స్పందించారు.
టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్(58) పదవీకాలం వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ చర్చలు మొదలయ్యాయని, చంద్రశేఖరన్ పనితీరు ఫలితంగా రెండోసారి కొనసాగించే ప్రయత్నాలు బోర్డు చేస్తోందని ఓ జాతీయ మీడియా పత్రిక కథనం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మీడియా, రతన్ టాటాను సంప్రదించింది.
‘‘ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు. ఆ కథనంలో వాస్తవం లేదు. పైగా చంద్రశేఖరన్‌ను రెండోసారి కొనసాగించాలనే బోర్డు ప్రతిపాదనేదీ నా దృష్టికి రాలేదు కూడా. ఈ విషయంలో టాటా సన్స్ బోర్డ్, షేర్‌హోల్డర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నా’’ అని రతన్ టాటా పేర్కొన్నారు.
మరోవైపు ఆ కథనంపై చంద్రశేఖరన్ సైతం స్పందించారు. వారసత్వ విషయమై రతన్ టాటాగానీ, బోర్డుగానీ, ట్రస్ట్గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన జోక్యం ఉండని ఈ వ్యవహారంలో.. సరైన టైంలో బోర్డు సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని సోమవారం ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారాయన.