రవీంద్ర జడేజా త్యాగం

రవీంద్ర జడేజా త్యాగం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయంలో అగ్రభాగం రవీంద్ర జడేజాదే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు బ్యాటింగ్‌లో 175 పరుగులు నాటౌట్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో 9 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా రాణించాడు. ఇక ఫాలో ఆన్‌ ఆడిన లంకను రెండో ఇన్నింగ్స్‌లో జడేజాతో కలిసి అశ్విన్‌ దెబ్బతీశాడు. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు. ఇదే మ్యాచ్‌లో అశ్విన్‌ కపిల్‌ దేవ్‌ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మొత్తంగా 436 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ 9వ స్థానంలో ఉ‍న్నాడు.

ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం అశ్విన్‌ మాట్లాడుతూ జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.” నిస్సందేహంగా జడ్డూదే ఈ టెస్టు మ్యాచ్‌. మొదట బ్యాటింగ్‌లో 175 నాటౌట్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో 9 వికెట్లు కూడా సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే జడేజా గురించి మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ మా ఇద్దరి వల్ల అతనికి ఎక్కువగా బౌలింగ్‌ వేసే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికి జట్టులో మూడో స్పిన్నర్‌ ఉన్నాడని గుర్తించడానికి జడేజా కొన్ని ఓవర్లను జయంత్‌ యాదవ్‌కు కేటాయించి త్యాగం చేశాడు.

వాస్తవానికి జడేజాకు మరోసారి ఐదు వికెట్లు తీసే అవకాశం వచ్చి ఉండొచ్చు. కానీ లంక రెండో ఇన్నింగ్స్‌లో జయంత్‌ యాదవ్‌కు బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు ఇవ్వడంతో జడేజా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఈ విషయంలో జడేజా స్వయంగా రోహిత్‌తో మాట్లాడి జయంత్‌ యాదవ్‌కు అవకాశం కల్పించాడు. నేను కూడా జడేజా నిర్ణయాన్ని సమర్థించా. జడేజా చెప్పినదాంట్లో నిజముందని.. జయంత్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నామని.. అందుకే అతనితో బౌలింగ్‌ వేయించడానికి రెడీ అయ్యాం. నిజంగా జడ్డూ సూపర్‌” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరగనుంది.