ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఇక మీ జీతం, పెన్షన్ డబ్బులు సెలవు రోజుల్లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్‌బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా మీ జీతం, పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కానున్నాయి.
ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది.అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది.