హోటల్ లో నాన్ వెజ్ తింటున్నారా అయితే జర జాగ్రత్త. మాంసాహార ప్రియులే టార్గెట్ గా చికెన్ సరఫరా దారులు నయా దందా సాగిస్తున్నారు. పలు హోటల్స్ ఫ్రెష్ చికెన్ బదులు ఇతర రాష్ట్ర్రాల నుంచి ప్యాకింగ్ లో తెప్పించుకున్న చికెన్ ను వండి వడ్డిస్తున్నాయి. చికెన్ లోని కొన్ని భాగాలకు కొన్ని ప్రాంతాలలో డిమాండ్ వుండదు.
చికెన్ ఎగుమతి చేసే కంపెనీలు కూడా కొన్ని భాగాలను మాత్రమే ప్యాక్ చేసి ఎక్స్ పోర్ట్ చేస్తాయి. ఇలాంటి ఎగుమతి చేసే కంపెనీలు తమిళనాడులోని కోయింబూత్తూరు నగరంలో చాలానే వున్నాయి. కోడి లివర్, కందనకాయ, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు.ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తొలుత చెన్నై హోల్సేల్ మార్కెట్కు అక్కడి నుంచి మినీ ఆటోల ద్వారా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు నాణ్యత లేని కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజాగా నెల్లూరు నగరంలో ఓ చికెన్ మాఫియా గుట్టు రట్టైంది. ఇతర రాష్టాలలో మిగిలిపోయిన చికెన్ తెచ్చి ఇక్కడ హోటల్స్ కు విక్రయిస్తుంది ఓ ముఠా. తక్కువ రేటుకు వస్తుంది కదాని పలు హోటల్స్ నాణ్యత లేని మాంసాన్ని వండి వారుస్తూ నాన్ వెజ్ ప్రియులను మోసగిస్తున్నారు. కోడిని కోసిన తర్వాత మూడు గంటలు దాటితే ఆ మాంసంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాంటి చికెన్ తింటే రోగాలు తప్పవు. 24 గంటల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసి చికెన్ తిన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.