ఓ తల్లి ఆశాదేవి తన కుమార్తె భవిష్యత్ జీవితం కోసం కన్న ఎన్నో కలలు చిద్రమైపోయాయి. ప్రతి రోజు లాగానే ఆమె కుమార్తె బయటకు వెళ్లింది… చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వైద్య విద్య అభ్యసిస్తోన్న ఆ తల్లి కూతురు కలలు నాశనమైపోయాయి. ఆమె జీవితం ఊహించని విధంగా… ఇంకా చెప్పాలంటే ఎవ్వరికి చెప్పుకోలేని విధంగా ముగిసి పోయింది. కదులుతోన్న బస్సులోనే ఆమె కుమార్తెను ఆరుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన చంపడం దేశవ్యాప్తంగానే అందరిని కలిచి వేసిందంటే.. ఇక ఆమెను కన్న ఆ తల్లి హృదయం ఇంకెంత తల్లడిల్లి ఉంటుందో ఆలోచించుకోవాలి.
ఇక ఆ తల్లి తన కుమార్తెకు జరిగిన అన్యాయం దేశంలో మరెవ్వరి కుమార్తెకు.. మరో ఆడ పిల్లకు జరగ కూడదని నిందితులకు ఉరి శిక్ష పడేందుకు ఎన్నో పోరాటాలు చేసింది. ఈ పోరాటాల్లో ఆమె తన విలువైన ఎనిమిది ఏళ్ల జీవితం సైతం కోల్పోయింది. ఆరోగ్యం సైతం దెబ్బతిన్నా లెక్క చేయకుండా.. నిర్భయ తండ్రి కన్నా కూడా తల్లి ఆశాదేవే పట్టు వదలని విక్రమార్కురాలిగా ఫైట్ చేసింది. చివరకు సుప్రీంకోర్టు 2018 జూలై 19నే ఈ నలుగురు నిందితులకు ఉరి వేయాలని తీర్పు ఇచ్చింది.
కారణాలు ఏవైనా .. ఈ కేసులో ఉరి శిక్ష ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మొత్తం మూడు సార్లు ఉరి వాయిదా వేశారు. దోషుల తరపున గట్టి లాయర్ అయిన ఏపీ సింగ్ ఎన్నో విధాలా వాదించారు. చివరకు ప్రధాన నిందితుడు రామ్ సింగ్ గతంలోనే తిహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా… మిగిలిన నలుగురు నిందితులు అయిన పవన్, ముఖేష్, అక్షయ్, విజయ్ ఉరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ పోరాటంలో నిర్భయ తల్లి ఆశాదేవి నిజమైన హీరోగా నిలిచి దేశంలోనే చరిత్ర క్రియేట్ చేశారు.