తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. కానుకలు సమర్పించుకుంటానని అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల దేవుళ్లు, దేవతలకు కేసీఆర్ అప్పట్లో మొక్కుకున్నారు. వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ వంతు అందుకే త్వరలో కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మంచి వేడెక్కిన సమయంలో మొక్కిన మొక్కులను ఒక్కొక్కటిగా కేసీఆర్ చెల్లించుకుంటూ వస్తున్నారు. సహజంగానే మొదటి రోజునుండీ ప్రభుత్వం డబ్బులతో మొక్కులు చెల్లించడమేమిటన్న విమర్శలు నుంచి వస్తున్నాయి. ఆయన తిరుమల శ్రీవారికి దాదాపు రూ. 5 కోట్లతో అద్భుతమైన సాలగ్రామహారం, కంఠాభరణం చేయించారు. 14.2 కిలోల సాల గ్రామహారం, 4.65 కిలోల మకరకంఠిలను శ్రీవారికి సమర్పించారు.
అలాగే మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలను సమర్పించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ. 3 కోట్ల 70 లక్షల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ కేసీఆర్ విజయవాడ పర్యటనకు మరో విధంగా వర్ణించారు. కొండమీద అమ్మోరు.. కొండ కింద కమ్మోరుని ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ విజయవాడ వెళుతున్నారని కేసీఆర్ పర్యటనను తేల్చేసారు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మతల్లి, ఊరూరా పోచమ్మ తల్లులున్నారని ఇక్కడ ఎవరికీ ఏమీ చేయించని సీఎం.. విజయవాడకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని ముక్కుపుడక ఇవాళే ఎందుకు గుర్తుకు వచ్చిందని ? ఎన్నికలకి ఇంకా ఏడాదే ఉండడంతో కమ్మవాళ్లను ప్రసన్నం చేసుకుంటే ఆ వర్గం వోట్లు ఆయనకు పడతాయని ఆయన ఈ విధంగా చేస్తున్నట్టు రేవంత్ చెప్పుకొచ్చారు. ఇది దేవుడి మొక్కు అయినా ఎన్నికల ఏడాది తీర్చుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు