కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్‌కౌర్ బాదల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలిపారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు తాను రాజీనామా చేశానన్నారు బాదల్. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేకంగా అభివర్ణించడానికి ఆమె నిరాకరించారు. ఈ బిల్లు గురించి తాను గత కొన్ని వారాలుగా రైతులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
తాను రైతులను ఒప్పించలేకపోయానని.. పైగా వారు చెప్పిన కారణాలు తనకు సహేతుకంగా తోచడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. బాదల్ మాట్లాడుతూ ‘ఒక రైతు నాతో ఈ విధంగా చెప్పాడు.. ప్రారంభంలో జియో లాంచ్ అయినప్పుడు తమ మార్కెట్‌ను పెంచుకోవడం కోసం ఉచిత ఫోన్లు ఇచ్చింది. జనాలు వాటికి అలవాటుపడటంతో పోటీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో జియో రేట్లను పెంచింది. ఇప్పుడు వ్యవసాయంలో తీసుకువచ్చే బిల్లులు కూడా ఇలానే ఉంటాయి. పూర్తిగా కార్పొరేట్ చేయబోతున్నారు’ అని తెలిపాడు. ఆ రైతు చెప్పిన ఉదాహరణ సబబుగా తోచింది. అందుకే నేను రాజీనామా చేశాను’ అన్నారు బాదల్.
లోక్‌సభ గురువారం ఆమోదించిన మూడు బిల్లులకు సంబంధించి ముందు రైతులు లేవనెత్తిన ఆందోళనలను వినాలని, వారితో బహిరంగ చర్చలు జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పదేపదే కోరినట్లు బాదల్ తెలిపారు. ‘దయచేసి రైతు వ్యతిరేకమని భావించే చట్టాన్ని తీసుకురావద్దని నేను చెప్తున్నాను. ప్రజల అవగాహనను పరిగణనలోకి తీసుకోకుండా మీరు ఈ బిల్లులను ఎలా ఆమోదించారు. నేను వారిని ఒప్పించటానికి ప్రయత్నించాను కాని ఫలితం లేకపోయింది. బహుశా నా వాయిస్ తగినంత బిగ్గరగా లేదు’ అన్నారు బాదల్. ఇప్పుడు రాజ్యసభ చేపట్టబోయే ఈ బిల్లులు జూన్‌లో జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లను భర్తీ చేస్తాయి. కాని రైతుల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో తీవ్ర నిరసనలు రేకెత్తించాయి. ప్రతిపాదిత చట్టాలు చిన్న, ఉపాంత రైతులకు సహాయపడటానికి ఉద్దేశించినవి అని ప్రభుత్వం తెలిపింది.