ప్రస్తుత లైఫ్ స్టైల్లో ప్రతిఒక్కరూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడిపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య గుండె పోటు. కొందరికి ఈ సమస్య వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఇటీవల ఓ అధ్యయనంలో కూడా తేలింది. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఒక మనిషి పదేళ్ల వ్యవధిలో హృదయ సంబంధ వ్యాధుల బారిన పడతాడని లేదా మరణిస్తాడని ఈ సర్వేలో స్పష్టమైంది. ఒక వారంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి పానీయాలు తీసుకుంటున్నారు, వాటి పరిమాణాల గురించి ఈ సర్వే ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు. దీంతో పలువురు హృదయ సంబంధం వ్యాధులకు సంబంధించి సమస్యలను బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహార విధానానికి కట్టుబడి ఉంటున్నారో అంచనా వేయడానికి తగ్గ ప్రశ్నావళిని కూడా పరిశోధకులు ఉపయోగించారు. అంటే వారు ఎలాంటి డైట్ పాటిస్తున్నారు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎలా తీసుకుంటున్నారో అంచనా వేశారు. ఈ సర్వేలో పాల్గొన్నవారికి 0 నుండి 55 వరకు స్కోరు కేటాయించారు. స్కోరు అధికంగా ఉన్నవారు మెరుగైన ఆహారం తీసుకున్నట్లుగా నిర్ధారించారు.
జంక్ ఫుడ్ అధికంగా తినడం, సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తాగటం వల్ల, ఫాస్ట్ ఫుడ్ తరచూ లాగించటం వల్ల నిద్రలేమి సమస్య పట్టి పీడిస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. బాగా వేయించిన ఆహారంలోని చిన్న చిన్న పదార్థాలు గుండెకు అలాగే రక్తాన్ని ప్రసరణ చేసే ధమనులకు హాని కలిగిస్తాయని తెలిసింది. ప్రతిరోజు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినేవారిలో 28 శాతం మంది గుండె రక్తప్రసారణలో ప్రమాదం కలగనుందని పేర్కోంది.
9.5 సంవత్సరాల నుంచి వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి గుండె సంబంధ వ్యాధులు అలాగే ప్రమాదకరమైన వ్యాధులకు గల కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సర్వే చేపట్టారు. మహిళలు జంక్ ఫుడ్ తింటే సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని సర్వేలో తేలింది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు శాతం పెరిగి బరువు పెరుగుతారని, దాని వల్ల పిల్లలు పుట్టడం కష్టం అని వైద్యులు అంటున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు ఇంకా అధికమవుతాయని సర్వేలో తేలింది. వేయించిన ఆహారాన్ని తినడం వలన కొరోనరీ గుండె జబ్బులు 22 శాతం, గుండె ఆగిపోవడం వంటివి 37 శాతం జరుగుతుందని తెలిపారు. వారానికి 114 గ్రాముల వేయించిన ఆహారాన్ని ప్రతిసారి తినడం వలన 3 శాతం కొరోనరీ గుండె జబ్బులు, 12 శాతం గుండె ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన గుండె సమస్యలు అధికమవడానికి గల కారణాలను ఇంకా విశ్లేషించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. బరువు తగ్గడం, ఫిట్ నెస్, సన్నగా, ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే అధికంగా వేయించిన ఆహారాన్ని తినకూడదు. అలాగే మంచి ఆరోగ్యం, బలమైన రోగనిరోధక శక్తిని పొందడానికి రోజూ చాలా పండ్లు మరియు కూరగాయలను తినాలి. వీటితోపాటు కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్, ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉన్న భోజనాన్ని తినడం మంచిది. రోజూ ఇలాంటి ఆహారాన్ని తినడం ద్వారా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు.
మరోవైపు ఎదిగే వయసులో పిల్లలకు కావాల్సిన పోషకాహారం లభించక, శారీరక వికాసం గాడి తప్పేలా జంక్ ఫుడ్ చేస్తోంది. పిల్లల మానసిక వికాసంపై దుష్ప్రభావం చూపే ఫాస్ట్ ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచక తప్పదనేంత స్థాయిలో ఫాస్ట్ ఫుడ్ హాని చేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్యల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. టీనేజర్లు మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయసులో జంక్ ఫుడ్ వల్ల ఎదగకుండా పోవటమే కాకుండా తీవ్ర మానసిక ఆందోళనకు వారిని గురిచేస్తూ, ప్రశాంతమైన నిద్రకు పిల్లలను దూరం చేసే జంక్ ఫుడ్ తో తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త. ఇలా కంటినిండా నిద్ర కరువై, పగలంతా నీరసంతో బాధపడే విద్యార్థులు, తమ చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేరు.
వేపుళ్లు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే… మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు… రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందు వల్ల మనం డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అవసరమైతే నోరు కట్టేసుకోవాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ… రోజూ అలాంటివి తింటే గుండెకు చేటు కలగడం ఖాయం.
మనం తినే ఆహారాల్లో మృతం, అమృతం అని రెండు రకాలుంటాయి. డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే జంక్ ఫుడ్ బదులు ఆకుకూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి మృతం కాని… అమృత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. ఈ ఫార్ములాను పక్కాగా ఫాలో అయిపోండి. అమృతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువ. అందువల్ల అవి తింటే గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.