నంద్యాల‌లో రికార్డు స్థాయి పోలింగ్

record-votes-polled-in-nandyal-bypoll-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ఆస‌క్తి రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగ‌టంతో పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉప ఎన్నిక‌లో నంద్యాల ప్ర‌జ‌ల చైత‌న్యం వెల్లివిరిసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల క‌న్నా ఎక్కువ‌గా రికార్డు స్థాయిలో ఓటింగ్ న‌మోద‌యింది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యానికే 71.91 శాతం , సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యానికి 77.66 శాతం పోలింగ్ న‌మోద‌యింది.

ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు ఓట‌ర్లు బారులు తీరారు. పోలింగ్ స‌మ‌యం ముగిసేట‌ప్ప‌టికి క్యూ లైన్ల‌లో ఉన్న ఓట‌ర్ల‌ను ఓటు వేసేందుకు అనుమ‌తించారు. మొత్తం 255 కేంద్రాల్లో పోలింగ్ జ‌రిగింది. నంద్యాల‌లోని ఏడో వార్డు ఎన్టీఆర్ షాదీఖానా వ‌ద్ద దొంగ నోట్లు వేస్తున్నారంటూ వైసీపీ ఫిర్యాదుచేయ‌టంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక అక్క‌డ‌కు చేరుకున్నారు. వైసీపీ త‌ర‌పున శిల్పా చక్ర‌పాణి రెడ్డీ రావ‌టంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. దీంతో రాయ‌ల‌సీమ రేంజ్ ఐజీ ఇక్బాల్ అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. అర‌గంట హైడ్రామా త‌ర్వాత ఉద్రిక్త‌త‌లు చ‌ల్లారాయి. బొగ్గు కాల‌నీలోనూ ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగినా త‌రువాత స‌ద్దుమ‌ణిగింది. ఈ స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగింది.

పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహ‌రించ‌టంతో ఎలాంటి శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా పోలింగ్ ముగిసింది . అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాయి. మూడేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై ఉప ఎన్నిక రెఫ‌రెండం అని వైసీపీ ప్ర‌చారం చేసింది. జ‌గ‌న్ ఎలాంటి వాద‌న‌లతో ముందుకు వెళ్లినా ఉప ఎన్నిక‌లో గెలుపు త‌మ‌దే అని టీడీపీ భరోసాలో ఉంది. ఈ నెల 28న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

మరిన్ని వార్తలు: