నివర్ తరువాత రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరందాటే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో తుపాన్ సహాయక చర్యలను సమీక్షించారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది.
మంగళవారం సాయంత్రానికి వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతూ నేడు సాయంత్రం లేదా రాత్రి త్రికోణకొండల సమీపంలో తీరందాటగలదని అంచనావేశారు. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్‌కాశీ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలపై సీఎం ఎడపాడి సమీక్ష నిర్వహించారు.
బురేవిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, భయపడాల్సిన పని లేదని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మీడియాకు మంగళవారం తెలిపారు. అరక్కోణం నుంచి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నాగర్‌కోవిల్‌కు పంపామన్నారు. కుమరి నుంచి 161 మరపడవల్లో ఇటీవల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన రెండువేల మంది మత్స్యకారులు తీరం చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. బురేవి హెచ్చరికల సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపట్టారు.