బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తాంధ్రకు చేరువగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, గురువారం చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు, చెన్నైలో 20 సెం.మీ.కిపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూర్, విళ్లుపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వేలూర్, మహాబలిపురం, తిరువణ్ణామలై, పుదుచ్చేరి, కడలూర్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం సూచించింది. తమిళనాడులోని తూత్తుకుడి, రామనాథపురం, విళ్లుపురం, మదురై, శివగంగై, సేలం, విరుదునగర్, పుదుక్కోట్టై, పెరంబలూర్, కళ్లకురిచ్చి, తేని, దిండుగల్, కరూర్, తిరుచ్చి, తెన్‌కాశి, అరియలూర్ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
చెన్నైలో గురువారం ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 60 కి.మీ. వేగానికి చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా మారి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరువగా గురువారం సమీపించనుంది ఐఎండీ హెచ్చరించింది.
దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్పపీడనం భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత తీర ప్రాంతాలవైపు కదిలే అవకాశం ఉందని వివరించింది.
గత వారం కురిసిన వర్షాల నుంచి ఇంకా తేరుకోక ముందే మళ్లీ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో చెన్నైవాసులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన చెన్నై కార్పొరేషన్ అధికారులు.. బుధవారం కూడా వదర నీటిని తోడే చర్యలు చేపట్టారు. 848 మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా చెన్నైలోని అనేక వీధుల్లో గతంలో కురిసిన వర్షపు నీరు తొలగని పరిస్థితి.