ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్‌ అలెర్టు

ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్‌ అలెర్టు

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్‌ అలెర్టు జారీ చేసింది. ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న​ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తాజాగా ముంబై పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్‌గ‌ఢ్‌, ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్‌, విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాగా శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబై మహా నగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కుండపోత వాన పడటంతో 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేగాక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.