సచిన్ కి ధోనితో ఉన్న అనుబంధం

సచిన్ కి ధోనితో ఉన్న అనుబంధం

భారత క్రికెట్‌ దిగ్గజం.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఎంఎస్‌ ధోనితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్సీ కోసం ధోనీ పేరును తానే సూచించినట్లు సచిన్‌ చెప్పుకొచ్చాడు. పీటీఐతో జరిగిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

‘2007లో దక్షిణాఫ్రికా వేదికగా మొదటిసారి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే గాయాల ఉండడం వల్ల టోర్నీకి దూరంగా ఉండాలని భావించా. అయితే నాతో పాటు గంగూలీ, ద్రవిడ్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే టీ20 జట్టుకు ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ అడిగినప్పుడు.. నేను ఎంఎస్‌ ధోని పేరు సూచించా. అంతకు ముందు చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ధోనీ ఆటను, మైదానంలో అతను వ్యవహరించే తీరును దగ్గర్నుంచి పరిశీలించా.

దీంతా పాటు స్లిప్స్‌లో నిలుచున్నప్పుడు ఫీల్డింగ్‌తో పాటు పలు అంశాలపై ధోనీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలోనే ధోనికి మ్యాచ్‌ను పూర్తిగా చదివేస్తాడని.. భవిష్యత్తు కెప్టెన్‌ అతనేనని అప్పుడే ఊహించా. అందుకే బోర్డుకు ధోనీ పేరును సూచించా. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలిసిందే. ‘ అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. శనివారం(ఆగస్టు 15) సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎంఎస్‌ ధోని సెప్టెంబర్‌ 19 నుంచి జరగనున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కనిపించనున్నాడు.