Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లపై విధించిన అసెంబ్లీ బహిష్కరణను హైకోర్టు ఎత్తివేసింది. వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. వారు తప్పుచేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ… అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన రోజు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించివేయడంతో పాటు హెడ్ ఫోన్ లు స్పీకర్ పోడియం వైపు విసిరేశారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ పక్కనే కూర్చుని ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలినట్టు టీఆర్ ఎస్ ఆరోపించింది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే స్వామిగౌడ్ ను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మరుసటి రోజు క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించడంతో పాటు శాసనసభ్యత్వాలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై కోమటిరెడ్డి, సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీనుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. తమ బహిష్కరణ వేటు వెనక రాజకీయదురుద్దేశాలు ఉన్నాయని, తమపై జరిగిన కుట్రలో అసెంబ్లీ స్పీకర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర ఉందని, తమకు నోటీసులివ్వకుండానే, బహిష్కరణ ప్రక్రియ జరపకుండానే చర్యలు తీసుకున్నారని కోర్టుకు విన్నవించారు.
దీనిపై పలుమార్లు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్ సభ్యులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీచేసిన జీవోలన్నీ రద్దయినట్టేనని కాంగ్రెస్ సభ్యుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది చెప్పారు. తీర్పుపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.కె.అరుణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా… తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.