నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్యకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పుకప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణూ.. ఆపదకాలంలో ప్రజలకు తోడుగా తనవంతు సాయం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు అకీరా ఎంట్రీ గురించి పదేపదే అడుగుతున్నారు. నెటిజన్ల పోరు భరించలేక.. సింపుల్‌గా ఒక పోస్ట్‌పెట్టి తప్పించుకున్నారు రేణూ దేశాయ్.
అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు అన్నారు. దీంతో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ అకీరాతో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుంది’అని రేణు చెప్పుకొచ్చారు.