సోషల్ మీడియా వచ్చిన తరవాత మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి చర్చా వేదిక దొరికిందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఆ చర్చా వేదిక రానురాను చండాలమైన వేదికగా మారిపోయింది. సెలబ్రిటీలను సైతం వదలకుండా ఎంతబడితే అంత మాట అనేస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్‌పై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ అసభ్యకర పదజాలాన్ని వాడాడు. దీనిపై రేణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ పోస్టే పెట్టారు. ప్రస్తుతం రేణు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులను పరామర్శిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. అయితే రేణు చేసిన ఓ పోస్ట్‌పై ఒక యూజర్ కామెంట్ చేస్తూ అసభ్య పదజాలం వాడాడు. ‘నవ్వొస్తోంది. నేను ఒక రైతుబిడ్డను. రెండు దశాబ్దాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. మీ లాంటివాళ్లు రైతుల కోసం ఏం చేశారు? ఏమీ చేయలేదు. డబ్బు కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామాలు ఆడుతున్నారు’ అంటూ ఘాటు కామెంట్ చేశాడు. ‘‘ఈ పోస్ట్ కచ్చితంగా చదువుతారనే అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడన్నా ‘F’ అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు! ఇదేంటి?అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు దూషించొచ్చు. అవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలి సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురికాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదు! ప్రతి రోజూ మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా లేక పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదన్నా కారణం కోసం చేస్తున్నానా అన్నది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలు ఎంత వరకు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం అన్నది ముఖ్యం! ఏదో ఒక రోజు ఈ ఊరూ పేరూ లేని ఈ ట్రోల్ చేసే వాళ్లంతా వారి తప్పు తెలుసుకుని వారి శక్తి సామర్థ్యాలని ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం పెట్టకుండా ఏదైనా మంచి పని కోసం పెడితే మంచిది.’’ అనో రేణు పోస్ట్ చేసింది.