తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని అందుకే అదే చేయాలని సీబీఐ అభిప్రాయపడుతోంది. అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి కోసం ఆమె తల్లి శంషాద్‌బేగంను సీబీఐ అధికారులు కలిశారు. తన కూతురికి న్యాయం జరుగుతుందంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. శంషాద్‌బేగం తరపు లాయర్ కూడా ఇదే అభిప్రాయాన్ని సీబీఐ అధికారులకు చెప్పారు. అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం చేస్తే ముస్లిం మతపెద్దల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కోర్టు అనుమతి తీసుకోవాలని సీబీఐ అధికారులు యోచిస్తున్నారు. అలాగే అయేషా తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టులు చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న అయేషా శాంపిల్స్‌తో డీఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో పరీక్షించనున్నారు. అయేషా హత్య జరిగినప్పుడు సేకరించిన శాంపిల్స్‌ను ఓ కానిస్టేబుల్ నాలుగు రోజుల పాటు దాచేశాడని గతంలో శంషాద్‌బేగం ఆరోపణలు చేశారు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్నవి అసలు అయేషా శాంపిల్సేనా? కాదా? అన్నది తేల్చేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది.