బాబుకి అందిన రిటర్న్ గిఫ్ట్

return gift to babu

గతేడాది తెలంగాణాలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తమ ఓటమి కోసం పాటుపడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయన నిజంగానే ఏమన్నా చేశారో లేదో కానీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చూవిచూసింది. మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైసీపీ ఘన విజయం సాధించి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. నిన్న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవగా విజయవాడలో ‘రిటర్న్ గిఫ్ట్’ అంటూ ఓ ప్లెక్సీ వెలిసింది. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్, స్టాలిన్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గేట్ వే హోటల్‌లో బసచేశారు. ఈ హోటల్ పక్కనే ఈ ప్లెక్సీని ఏర్పాటు చేయడం కొసమెరుపు. జగన్‌కు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫోటోతో పాటు ‘థ్యాంక్స్ కేసీఆర్ గారు… ఫర్ రిటర్న్ గిఫ్ట్’ అని ఉంది. దీనిని చిరంజీవి అనే స్థానిక వైసీపీ నేత ఏర్పాటు చేసినట్టు ఫ్లెక్సీపై ఉన్న పేరును బట్టి తెలుస్తోంది. ఇక, జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం అని జగన్‌ వయసు చిన్నదే అయినా బాధ్యత మాత్రం పెద్దదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో ఆయనను ప్రజలు గెలిపించారని, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు.