Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నన్నాళ్ళు అప్పట్లో టీడీపీ లో వున్న రేవంత్ రెడ్డి చేయని విమర్శలు లేవు. కానీ కాంగ్రెస్ లో చేరాక అదే వై.ఎస్ స్పూర్తితో ముందుకు నడుస్తున్నట్టుంది రేవంత్ . ఏ విషయంలో అంటారా ?. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడంలో. 1995 నుంచి 2004 దాకా అధికారంలో వున్న చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోడానికి వై.ఎస్ ఎన్నెన్నో విమర్శలు,ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. అయితే చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేక చివరకు తనంతట తానే వేసిన కేసులు వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయి. మురళి మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబుకు ముడి పెట్టడం దగ్గరనుంచి ఎన్నో అంశాల్లో వై.ఎస్ చేసిన ఆరోపణల్లో పస లేదని తేలింది.
తాజాగా రేవంత్ రెడ్డి సైతం అదే రూట్ లో నడుస్తున్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సైబర్ టవర్స్ దగ్గర్లోని ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో నాగార్జున మీద రేవంత్ ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి ఫాలో అప్ లేదు. ఇక డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు అందులో కూడా తెరాస నేతల హస్తం ఉందని రేవంత్ ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు వాళ్ళ పూర్వాపరాలు బయటపెడతానన్న రేవంత్ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఈ మధ్య కేటీఆర్ కి పిల్లల్నిచిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ఉద్యోగం చేసాడని మరో సంచలన ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు వున్నాయి అన్నారు తప్ప అవేంటో బయట పెట్టలేదు. ఇప్పుడు తాజాగా మెగా స్టార్ చిరంజీవి మీద భూకబ్జా ఆరోపణలు చేసారు రేవంత్.
గచ్చిబౌలి సర్వే నెంబర్ 83 /1 లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలోకి తెచ్చుకున్న చిరంజీవి దాన్ని ఓ తెలంగాణ మంత్రికి లీజ్ కి ఇచ్చారని అంటున్నారు. ఆయన కెసిఆర్ కి సన్నిహితుడైన మంత్రి అని కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో బయటపెడతా అని రేవంత్ అంటున్న మాటలు నమ్మకశ్యంగా లేవు. ఇలా సంచలన ఆరోపణలు చేసి పక్కకు వెళ్ళిపోతే దాని వల్ల రాజకీయంగా ఆయనకు గానీ ప్రభుత్వ ఆస్తుల విషయంలో ప్రజలకు గానీ జరిగే మేలు ఏమీ ఉండదు.