రేవంత్ అక్కడ కాళ్ళుచేతులు కట్టుకుని కత్తి సాము చేయాలి.

Revanth Reddy joined in Congress party in presence of Rahul Gandhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వంట్లో పసుపు రక్తం, గుండెల్లో చంద్రబాబు మీద గురుభావం పెట్టుకుని మరీ హస్తం జెండా కిందకి చేరబోతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో హాట్ టాపిక్. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. కానీ ఆయన చేరిక కన్నా ముందే ఆయన మీద ఫిర్యాదులు 10 జన్ పథ్ కి చేరిపోయాయి. ఆయన ఇంకా చంద్రబాబుని పొగుడుతున్నారని, చంద్రబాబు కోవర్ట్ అని ఒకటేమిటి లెక్కకు మించిన కంప్లైంట్స్ వెళ్లాయి. ఇప్పటికిప్పుడు ఈ ఫిర్యాదుల వల్ల రేవంత్ చేరిక మీద, కాంగ్రెస్ పెద్దల ఆలోచనల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. అయితే భూమిలో పడ్డ విత్తనం సరైన వాతావరణం, కాలం ముంచుకొచ్చినప్పుడు మొలకెత్తకుండా ఉంటుందా ?. రేవంత్ కూడా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఇకపై రాజకీయ అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవరించకపోతే డేంజర్… యమ డేంజర్.

Revanth-in-congress

రేవంత్ ఇన్నాళ్లు టీడీపీ లో ఓ రకమైన స్వేచ్ఛ అనుభవించారు. ఇంటిపెద్దకి పిల్లలంతా సమానం అయినా చిన్నోడి అల్లరి భరించడానికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వాడిని గారాబం చేయడానికి పెద్దగా ఆలోచించరు. ఇదిగో ఇప్పటిదాకా టీడీపీ అనే ఇంటిలో చంద్రబాబు అనే ఇంటి యజమాని దగ్గర ఆ గారాల చిన్నోడి పాత్ర ని రేవంత్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఆటలాడితే ముద్దు చేశారు. పక్కనోళ్ళతో గొడవపడితే మద్దతు ఇచ్చారు. తప్పు చేస్తే పోనీలే అని ఊరుకున్నారు. ఈ తరహా రాజకీయం చేసి, చూసాక రేవంత్ కి పాలిటిక్స్ అంటే ఇంతే కదా అన్న ఆత్మవిశ్వాసం పెరిగిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడే అసలు కధ మొదలు అయ్యింది.

కాంగ్రెస్ అంటే విశాలమైన ప్లే గ్రౌండ్ అని రేవంత్ కి అనిపించవచ్చు. అక్కడ ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది. కానీ ఆట మొదలు పెట్టాక తెలుస్తుంది కాంగ్రెస్ అంటే కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి అని. ఆ అడవిలోనే పుట్టి పెరిగి ఇంకా అక్కడ ఏమి చేయాలో ఎలా ముందుకెళ్లాలి అని అర్ధం కాక కొట్టుకునే వాళ్ళు చాలా మంది వున్నారు. అందుకే తమకి తోడు ఉంటారని తాము ముందుకెళ్లడం పక్కనబెట్టి మిగిలిన ఎవరూ ముందుకు వెళ్లకుండా జాగ్రత్తపడే వాళ్ళు కోకొల్లలు. వారి మధ్యలోకి ఇలా వెళ్లి అలా యుద్ధం చేసి గెలిచేద్దాం అనుకుంటే అత్యాశే. అక్కడ యుద్ధం చేయాలంటే కత్తి సాము వస్తే చాలదు. కాళ్ళు చేతులు కట్టుకుని మరీ కత్తి సాము చేయాల్సి ఉంటుంది. వరసగా నాలుగు ఓటములు రాగానే ఏ కుటుంబం పేరు చెప్పుకుని ఓట్లు అడిగారో ఆ రాహుల్ గాంధీనే మార్చివేయాలని డిమాండ్ చేసేంత స్వాతంత్య్రం అక్కడ ఉంటుంది. ఆ స్వేచ్ఛలోను కాళ్ళు చేతులు మరీ ముఖ్యంగా నోటికి గుడ్డ కట్టుకుని యుద్ధం చేయడం నిజంగా కత్తి మీద సామే. తెలంగాణాలో కెసిఆర్ ని గెలవాలంటే ముందుగా కాంగ్రెస్ లో ఉంటూనే కాంగ్రెస్ ని గెలవాలి. ఈ యుద్ధం రేవంత్ సామర్ధ్యానికి అసలు సిసలు పరీక్ష.