కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి తమ నాయకుడని, ఆయనకు పార్టీ నేతలందరం అండగా ఉంటామన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డి వ్యవహారం తమ కుటుంబ సమస్య అని, అందరం కలసి మాట్లాడుకుంటామన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు వచ్చా యని కుంగిపోవద్దని, తనపైనా గతంలో ఇలాంటి పోస్టులు వచ్చాయన్నారు. జగ్గారెడ్డి రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన మంచి స్నేహితుడన్నారు. జగ్గారెడ్డి పార్టీ అధిష్టానం అపాయింట్‌మెంట్ కోరారని, ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని వివరించారు. కాగా, జగ్గారెడ్డి 2, 3 రోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు.